Ekkadi Manushajanmam - Peda Tirumalacharya Sankeerthana(ఎక్కడి మానుషజన్మం -పెదతిరుమలాచార్య సంకీర్తన)

Bijjam Brothers
Bijjam Brothers
202.6 هزار بار بازدید - 3 سال پیش - ఎక్కడి మానుషజన్మం - పెదతిరుమలాచార్య సంకీర్తన
ఎక్కడి మానుషజన్మం - పెదతిరుమలాచార్య సంకీర్తన (Ekkadi Manusha Janmam - Peda Tirumalacharya Sankeerthana)

Lyrics -
ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తిం బిఁకనూ

మఱవను ఆహారంబును మఱవను సంసారసుఖము
మఱవను యింద్రియభోగము మాధవ నీ మాయా
మఱచెద సుజ్ఞానంబును మఱచెద తత్వరహస్యము
మఱచెద నురువును దైవము మాధవ నీ మాయా

విడువనుఁ బాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాసలు విష్ణుఁడ నీ మాయా
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును
విడిచెద నాచారంబును విష్ణుఁడ నీ మాయా

తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధంబుల
తగులను మోక్షపుమార్గము తలఁపున యెంతైనా
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై
నగి నగి నను నీ వేలితి నాకా యీ మాయా

భావామృతం -
ఎక్కడి మనుష్య జన్మస్వామీ! ఇది? ఈ జన్మమెత్తి ఏమన్నా ఉపయోగం వుందా? లేదు. ఇక నీ ఇష్టం. నిజం చెబుతున్నాను ప్రభూ! నేను నిన్నే నమ్ముకొన్నాను.
ఓ మాధవా! నేనెంత దౌర్భాగ్యుడినంటే.... ఆహారమును విడువలేను రోజుమూడుపూటలా తినవలసిందే. సంసారసుఖం వదులుకోలేను. ఇంద్రియ భోగం మీద ఇసుమంతైనా విరక్తి లేదు. ఇక వాటిని మరువనుకానీ మంచి జ్ఞానమును తత్త్వరహస్యములను జగత్పతియైన దైవమును హితోపదేశం చేసే గురువును మాత్రం మఱచిపోతాను. దీనికి నేను కారణం కాదు ప్రభూ! నీమాయ ఆవరించడం చేత ఇట్లు జరుగుచున్నది.
ఓ విష్ణుదేవా! విడువకుండా పాపాలు పుణ్యాలు ఒకదాని వెంట ఇంకొకటి చేస్తూనే ఉన్నాను. నా చెడుగుణములను వదిలిపెట్టలేకున్నాను. ఆశాపాశముచే బంధింపబడి ఆశను విడువలేను ఇదంతా నీ మాయయే కదా! ఇదిట్లా వుంటే మానవులకు విధించబడిన ఆరు విధులను మాత్రం విడిచిపెట్టాను. వైరాగ్యం మాటనెత్తడం లేదు. ఆచారము అంటే ఏమిటో మఱచిపోయాను. విష్ణుస్వరూపా! ఇదంతా నీ మాయకాకామరేంటి?
ఓ ప్రభూ! నేను ఎన్నో చిక్కులలో తగులుకొంటాను. ఎన్నో బంధనములలో తగులుకొంటాను. ఇకపోతే నా ఆలోచనలలో కూడ మోక్షమార్గం జోలికి పోవటం లేదు. ఇవన్నీ జరిగినా నాకేం భయం? ఓ వేంకటేశ్వరా! నాకు నీ దర్శనం అయింది. నీవు అంతర్యామిగా సంతోషంతో నన్ను రక్షిస్తున్నావు కదా! అట్టి నాకు నీమాయ అంటే ఏం భయం?
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)
3 سال پیش در تاریخ 1400/10/14 منتشر شده است.
202,675 بـار بازدید شده
... بیشتر