Hon'ble Dy CM Sri Pawan Kalyan's Speech At Commemoration Meeting of Padma Vibhushan Ramoji Rao Garu

JanaSena Party
JanaSena Party
93.6 هزار بار بازدید - 2 ماه پیش - పద్మ విభూషణ్, ఈనాడు గ్రూపు సంస్థల
పద్మ విభూషణ్, ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్  శ్రీ రామోజీరావు గారి సంస్మరణ సభలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

నిష్పక్షపాత జర్నలిజం విలువల నదీ ప్రవాహం... శ్రీ రామోజీరావు గారు

• ప్రభుత్వానికీ ప్రజలకీ మధ్య వారధిలా చివరి వరకు పని చేశారు  
• ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తపించిన మేరునగం
• నమ్మిన దారిలో నిజాయతీగా వెళ్ళమని శ్రీ రామోజీరావు గారు చేసిన సూచనలు నాకు ఇప్పటికీ గుర్తే
• గత ప్రభుత్వంలో ఎన్ని బెదిరింపులు వచ్చినా వెరవలేదు
• జర్నలిస్టులకు ఆయన ప్రయాణం ఓ మార్గదర్శకం

‘ప్రజా క్షేమం, ప్రజా అవసరం, ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా నిష్పక్షపాతంగా పాత్రికేయ ప్రమాణాలు పాటించిన మహనీయుడు శ్రీ రామోజీరావు గారు. పాలనాక్షేత్రంలో ఏం జరుగుతుందో ప్రజాక్షేత్రానికి కళ్లకు కట్టినట్లుగా చూపించే ఆయన జర్నలిజం విలువలు తరతరాల జర్నలిస్టులకు స్ఫూర్తిదాయకమ’ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖా మాత్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పద్మ విభూషణ్, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మెన్ శ్రీ రామోజీరావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గురువారం విజయవాడలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొని శ్రీ రామోజీరావు గారికి  ఘనంగా నివాళులు అర్పించారు.  శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రామోజీరావు గారి జీవితంలోని ముఖ్యఘట్టాలతో కూడిన ఆర్ట్ గ్యాలరీని తిలకించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి శ్రీ రామోజీరావు గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సంస్మరణ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “2019లో శ్రీ రామోజీరావు గారితో కలిసి సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం చిక్కింది. నమ్ముకున్న దారిలో ప్రజా క్షేత్రంలో ఏమైనా సరే నిజాయతీగా ముందుకు వెళ్లమని ఆయన సూచించిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తు. ఈ దేశానికి నిష్పక్షపాతమైన జర్నలిజం ఎంత అవసరమో, ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ఆయన ఎంత ఆలోచిస్తున్నారో ఆయన మాటల్లో అర్థమైంది. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలకు పూర్తి స్థాయిలో పారదర్శకంగా తెలియజెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. పాలకులు చెప్పే  విషయాలు అంతే నిష్పక్షపాతంగా ప్రసారమాధ్యమాలు ప్రజలకు తెలియజేయాలి అన్నది ఆయన ఆకాంక్ష. ప్రభుత్వంలో తప్పు జరిగితే దానిని సూటిగా ప్రజలకు చెప్పడం కూడా ప్రసార మాధ్యమాల బాధ్యతగా భావించారు. జర్నలిజం విలువలు పూర్తిగా పాటిస్తూ తప్పును తప్పుగా చూపడంలో శ్రీ రామోజీరావు గారు ఎన్నో విలువలు పాటించేవారు. తరతమ బేధం లేకుండా తప్పు జరిగితే ఎంతటి వారినైనా కలంతో ప్రశ్నించే జర్నలిస్టులను తయారు చేశారు. ఆయన స్ఫూర్తి నిత్యం ప్రజ్వరిల్లేలా నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వంలో సూక్ష్మమైన విషయాలను సైతం జరుగుతున్న అవినీతి తంతును సైతం ప్రజలకు చూపించడంలో శ్రీరామోజీరావు గారిది విభిన్నమైన శైలి. ఆయన దేనికి వెరవకుండా, భయపడకుండా చేసిన అక్షర ప్రయాణం ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోతుంది.

• ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి చివరి వరకు తపనపడ్డారు

గత ప్రభుత్వంలో చేసిన తప్పులను పూర్తి స్థాయిలో ప్రజలకు అందించడంలో శ్రీ రామోజీరావు గారు దేన్నీ లెక్క చేయకుండా ముందడుగు వేశారు. గత ప్రభుత్వంలో ఎన్నో వేధింపులు, బెదిరింపులు, దాడులకు వెరవకుండా అక్షర ప్రయాణాన్ని ముందుకు సాగించారు. ఓ వైపు జర్నలిజాన్ని, మరో వైపు  వ్యాపార సామ్రాజ్యాన్ని ఉన్నతంగా నడిపారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఆయనపై రకరకాలుగా దాడులు చేసినా ఏమాత్రం ఆయన పట్టించుకోకుండా ముందుకు కదిలిన తీరు నిజంగా ఓ సాహసం. ప్రజాస్వామ్య పరిరక్షణకు 2024లో రాష్ట్రంలో  కూటమి ప్రభుత్వం రావాలని బలంగా కోరుకున్న శ్రీ రామోజీరావు గారు కూటమి ప్రభుత్వ విజయాన్ని జీవిత అంత్య దశలో ఒక రోజంతా  ఆనందంగా అనుభవించి కన్నుమూయడం ఈశ్వరేచ్ఛ. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రంలో బలమైన ప్రజా ప్రభుత్వం రావాలన్నది ఆయన ఆకాంక్ష. అది జరిగిన తర్వాతే ఆయన పరలోకాలకు తరలి వెళ్లడం ఆయన బలమైన సంకల్పానికి సంకేతం.

• సమాచార హక్కు చట్టం విలువ అందరికీ తెలియాలని తపించారు

సమాచార హక్కు చట్టం  ద్వారా ప్రజలకు పాలనలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం లభించింది. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలు తెలుసుకునే విధంగా తీసుకువచ్చిన చట్టాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలి అనే విధంగా ఆయన తన ఈనాడు పత్రిక, ఈటీవీల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గొప్ప చట్టం అందరికీ ఉపయోగపడాలి, ప్రజల్లో అవగాహన రావాలి అని తపించారు. సమాచార హక్కు చట్టం మీద ప్రత్యేకంగా ఒక ఉద్యమం లాంటిది నడిపారు. ఈనాడు - ఈటీవీ కేంద్రంగా సమాచార హక్కు చట్టం ప్రజలకు పూర్తిస్థాయిలో అవగతం అయ్యేలా ఆయన ప్రత్యేకంగా కృషి చేశారు.

శ్రీ రామోజీ రావు గారు ఓ చైతన్య ప్రవాహం. అక్షరాలను వాగులుగా, వంకలుగా చేసి ఆయనలో నింపుకొన్న గొప్ప జీవ నది. అది ఎన్నో మైళ్ళు స్ఫూర్తి ప్రయాణం చేసి మన రాష్ట్రంలో తరగని చైతన్య సిరులను నింపింది. శ్రీ రామోజీరావు గారి లాంటి గొప్ప దార్శినికుడి జాడలో మనమంతా నిజాయితీ, నిబద్ధత, నిష్పక్షపాతం అనే సుగుణాలతో ముందుకు సాగాలని అప్పుడే ఆ మహానుభావుడికి నిజమైన నివాళిగా భావిస్తున్నాను" అన్నారు.

#JanaSenaParty #PawanKalyan
2 ماه پیش در تاریخ 1403/04/07 منتشر شده است.
93,692 بـار بازدید شده
... بیشتر